Alia bhatt on south film industry: 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్' చిత్రాలు సుమారు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం, బాలీవుడ్‌లో మంచి విజయాలు లేకపోవడం వల్ల చిత్ర పరిశ్రమలో 'ఉత్తరాది వర్సెస్ దక్షిణాది చిత్రాలు' అనే చర్చకు తెరలేచింది. ఆ రెండు భారీ ప్రాజెక్ట్‌ల తర్వాత అందరి దృష్టి సౌత్ ఇండస్ట్రీపైనే పడింది. ఈ పరిశ్రమను, ఇక్కడి నుంచి వచ్చే సినిమాలను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నటి ఆలియాభట్ సైతం ఈ చర్చలో భాగమయ్యారు. తన తదుపరి చిత్రం 'డార్లింగ్స్' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆలియా దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"భారతీయ చిత్రపరిశ్రమ మొత్తానికి ఇది క్లిష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో మనం బాలీవుడ్‌పై కాస్త దయ చూపించాలి. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని.. 'ఆహా బాలీవుడ్..? ఓహో బాలీవుడ్" అని చెప్పుకుంటున్నాం కానీ, ఈ మధ్యకాలంలో విడుదలై మంచి విజయాలు అందుకున్న బీ టౌన్ సినిమాలను మనం పట్టించుకుంటున్నామా? దక్షిణాది పరిశ్రమ నుంచి వచ్చే అన్ని సినిమాలు విజయం అందుకోవడం లేదు. అక్కడ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే విజయం అందుకుంటున్నాయి. కంటెంట్ మంచిగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాలు చూసేందుకు వస్తారు" ఆలియా భట్ అన్నారు. అనంతరం, ప్రెగ్నెన్సీలోనూ ప్రమోషన్స్‌లో పాల్గొనడంపై ఆమె స్పందిస్తూ.. "ఇలాంటి సమయంలో బ్రేక్ తీసుకోకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఇబ్బందిగా ఉందా? అని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే.. మనం సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్‌గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలోనూ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఉత్సాహాంతో వర్క్ చేసుకోవచ్చు. నాకు వృత్తి పట్ల ఉన్న ప్రేమ, అంకితభావంతోనే ఇది సాధించగలుగుతున్నా" అని వివరించారు.