ఆయన కథలోని పాత్రలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను ఉర్రూతలూపే మంచి కిక్ ఉంటుంది. రచయితగా సూపర్ హిట్ కథలను అందించడమే కాక దర్శకుడిగా చక్కటి చిత్రాన్ని తెరకెక్కించి, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన ప్రతిభ చూపిన క్రేజీ రైటర్ వక్కంతం వంశీ. తన భార్య శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన తన సినీ ప్రయాణం గురించి వివరించారు. అలానే దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
టెంపర్ అవకాశం అలా.. ఎన్టీఆర్ వల్లే ఈ ఛాన్స్ కూడా వచ్చింది. తనతో నా ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటా. అలా ఒకసారి టెంపర్ ఐడియా చెప్పాను. 3 సంవత్సరాల తర్వాత పూరీ, తారక్‌లకు కథ కుదరకపోతే నన్ను అడిగారు. ఆ టెంపర్ ఐడియాను వెంటనే తారక్‌కు చెప్పా. ఆయన పూరీకి చెప్పమన్నారు. నేను మొదట పూరీ జగన్నాథ్‌కు కథ చెప్పాలంటే భయపడ్డా. కానీ సగం వినగానే పూరీ ఓకే చేసేశారు.