Adipurush Movie Telugu Theatrical Rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది. పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఓవర్సీస్తో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. ఈ క్రమంలో టిక్కెట్ల కొనుగోలు కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమాను హిందీలో టీ సిరీస్ సంస్థ నిర్మించగా.. ప్రభాస్ హోమ్ బ్యానర్‌గా వ్యవహరిస్తూ వస్తున్న యూవీ క్రియేషన్స్ కూడా ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. యూవీకి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉన్నందున ఇక్కడ కూడా వాళ్ళే సినిమా డిస్ట్రిబ్యూషన్ పనులను చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. అయితే ఎంతకు కొనుగోలు చేసిందన్న విషయంపై అనేక రూమర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. భారీ స్థాయిలో రైట్స్ అమ్ముడుపోయినట్లు గుసగుసలు వినిపించాయి.
దీనికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ చెక్ పెట్టారు. అసలు విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 165 కోట్లుకు 'ఆదిపురుష్' తెలుగు రైట్స్ కొన్నది వాస్తవమే అంటూ ఆయన అంగీకరించారని సమాచారం. జీఎస్టీతో కలిపి ఈ రైట్స్ దాదాపు రూ. 185 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను తొలుత యూవీ క్రియేషన్స్ రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగింది. కానీ పీపుల్స్ సంస్థ ఎంట్రీతో ఈ రూమర్స్‌పై క్లారిటీ వచ్చినట్టైంది.