తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సెకెండ్​ ఇన్నింగ్స్​లో నటనతో అదరగొడుతూ.. పిల్లలతో 'మంచి అమ్మ' అనిపించుకుంటూ..

అటు తమిళనాట ఇటు తెలుగులోనూ ఓ వెలుగు వెలిగిన కొందరు అగ్రతారలు ఫస్ట్​ ఇన్నింగ్స్​లో అదరగొట్టేశారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక తమ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తూ ఓ వైపు అమ్మగా మరోవైపు సినీ ప్రపంచంలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో తమ సెకండ్​ ఇన్నింగ్స్​తో పాటు అమ్మతనం గురించి వీరి మాటల్లోనే..

actresses about thier mother hood and second innings
actresses about thier mother hood and second innings

By

Published : Nov 27, 2022, 8:43 AM IST

తెరవేల్పుగా కోట్లాది గుండెల అభిమానాన్ని సంపాదించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అదంతా ఒకెత్తు. పిల్లలతో 'మంచి అమ్మ' అనిపించుకోవడమే అసలైన సవాల్‌ అంటున్నారీ తారలు. అటు నటననీ.. ఇటు పిల్లల పెంపకాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథాన నడుస్తోన్న ఈ తారల అనుభవాలివీ..

వాళ్ల నుంచి నేనూ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటా
'1984లో 18 ఏళ్ల వయసులో వచ్చి, 4 ఏళ్లలోనే 27 సినిమాల్లో కథానాయకిగా చేశా. 1988లో చేతి నిండా సినిమాలున్నప్పుడే శిరీష్‌ గాడ్‌బోలేను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యా. చాలా కాలం అమెరికా, యూకేల్లో ఉన్నాం. మా ఇద్దరమ్మాయిలు సనమ్‌, జనా పెంపకంలో బిజీ అయ్యా. 16 ఏళ్ల గ్యాప్‌ తర్వాత, మళ్లీ నటన ప్రారంభించా. ఇప్పుడు ఏడాదికి రెండు మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ తిరిగి బిజీ అయ్యా. అయితే ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేదు.

నదియా

సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శిరీష్‌ ప్రోత్సహించినా పిల్లల గురించి ఆలోచించా. నేను షూటింగ్‌కు వెళితే వాళ్ల పనంతా ఎవరు చూస్తారని ఆలోచించా. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే మా అత్తామామ చేయూతగా నిలిచారు. తామున్నామని, నటించమని ప్రోత్సహించారు. అలా షూటింగ్‌కు వెళ్లినా మధ్యలో వచ్చి పిల్లల బాధ్యత తీసుకొనేదాన్ని. అప్పటికే వాళ్లిద్దరూ తమ పనులు తాము చేసుకోగలిగే స్థాయికెదిగారు.

చిన్నప్పటి నుంచి చదువుతోపాటు రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పే దాన్ని. క్రమశిక్షణ, సమయపాలన, చేసే ప్రతి పనినీ ప్రేమించడమెలాగో చెప్పా. నా శుభ్రత చూసి ఓసీడీ అంటూ వెక్కిరించే వాళ్లు. ఇప్పుడు వాళ్లూ పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఇంట్లో, సెట్లో ఉత్సాహంగా ఉంటూ ఒత్తిడికి దూరంగా ఉండే నన్ను చూసి పిల్లలూ అదే నేర్చుకున్నారు. ఈతరం పిల్లలు కదా వాళ్ల నుంచి నేనూ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటా'

ఆ లోటు వాడికి తెలియనివ్వను
'మోడలింగ్‌ నుంచి నటిగా మారా. ఈ 22 ఏళ్లలో తెలుగు సహా 7 భాషల్లో 58 పైచిలుకు చిత్రాల్లో నటించా. భరత్‌ ఠాకూర్‌తో పెళ్లయ్యాకా నటిస్తూనే ఉన్నా. యష్‌కు తల్లైన తర్వాత వాడి కోసం కాస్త విరామం తీసుకున్నా. పిల్లలు పెద్దైన తర్వాత వాళ్లతో కలిసి చూడగలిగేలా నా పాత్రలుండాలనుకొంటా. అమ్మయ్యాక బోల్డంత బాధ్యత వస్తుంది. వాడిని చూసుకొంటూ, షూటింగ్‌లకు హాజరవడం కష్టమే.

భూమిక

ఇప్పుడు వాడికి ఎనిమిదేళ్లొచ్చాయి. ఇద్దరం ఎక్కువగా వంటింట్లో కలిసి పని చేస్తుంటాం. కేక్‌లు, ఇతర వంటకాలు చేసుకొని తింటాం. స్విమ్మింగ్‌ చేస్తాం. ఇప్పటికీ కథల పుస్తకాలు చదివి వినిపించాల్సిందే. అంతరిక్షం, నక్షత్రాలు వంటి వాటిపై చాలా పుస్తకాలు కొనిపెట్టా. ఏ విషయంలోనూ ఎవరినీ నొప్పించకుండా, అదే సమయంలో ఎదుటి వారి వ్యాఖ్యల ప్రభావానికి లోనుకాకుండా ఉండేలా పెంచుతున్నా. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వంటివి నేర్పుతుంటా. కోరిందల్లా కాకుండా అవసరమైనది మాత్రమే కొనిస్తా. నేనెంత బిజీగా ఉన్నా.. ఆ లోటు వాడికి తెలియనివ్వను'.

పిల్లల్ని ఆహారం విషయంలో మెప్పించడం చాలా కష్టం
19 ఏళ్లప్పుడే నటించడం మొదలు పెట్టా. పదేళ్లలో తెలుగు సహా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించా. 2004లో బాల్య స్నేహితుడు దీపక్‌బగ్గాను పెళ్లి చేసుకొని సినిమాకు బ్రేకిచ్చా. మా ఇద్దరబ్బాయిలు అధీప్‌, అదిత్‌ల సంరక్షణ నేనే చూసేదాన్ని. వాళ్లు కాస్త పెద్దయ్యాక, పదేళ్ల వ్యవధి తర్వాత తిరిగి నటించడం ప్రారంభించా. అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూనే, నటననూ కొనసాగిస్తున్నా. కుటుంబానికే నా మొదటి ప్రాధాన్యత'.

సిమ్రన్​

'పిల్లల్ని ఆహారం విషయంలో మెప్పించడం చాలా కష్టం. ఎన్ని రకాలు వండినా ఏదీ సరిగ్గా తినేవారు కాదు. ఓ తల్లిగా పిల్లలకు పోషకాహారాన్ని తినిపించడం ఎంత కష్టమో అప్పుడు తెలిసేది. నాకు నటన కన్నా వీరితో తినిపించడమే పెద్ద సవాల్‌. చిత్రాల ఎంపికలో నేను సలహాలు అడిగే స్థాయికి ఇప్పుడు ఎదిగారు. రీఎంట్రీకి అవకాశం వచ్చినప్పుడు పిల్లల కోసం చిన్న షెడ్యూల్స్‌ పెట్టుకునే దాన్ని. ముంబయి నుంచి వెళ్లి, పూర్తయిన వెంటనే ఇంటికి చేరుకొనే దాన్ని. మధ్యలో దీపక్‌ చూసుకొనేవారు. ఇప్పటికీ షూటింగ్‌లో ఉన్నా ఎప్పటికప్పుడు పిల్ల్లలతో మాట్లాడతా. అన్నీ తెలుసుకుంటా'.

ABOUT THE AUTHOR

...view details