టాలీవుడ్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆమె నటించిన యశోద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సామ్ నటించిన మరో చిత్రం శాకుంతలం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
'నాకు బాగా కోపం వస్తే అలా చేస్తా.. మనం పుట్టింది ఎవరి అభినందనల కోసమో కాదు..' - సమంత వార్తలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానో కూడా చెప్పారు సామ్.
ఇటీవలే తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సామ్ వెల్లడించారు. తాను చాలా ధైర్యవంతురాలినని కచ్చితంగా ఈ వ్యాధితో పోరాడి నెగ్గుతాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న సామ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. తనకు కోపం వచ్చినప్పుడు జిమ్‌కు వెళ్లి ఇష్టానుసారంగా శారీరక వ్యాయామం చేస్తానని చెప్పారు. అప్పుడు వెంటనే కోపం తగ్గిపోతుందని తెలిపారు. తాను డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడనని.. తనకు డబ్బు ముఖ్యం కాదని నటనే ముఖ్యమన్నారు.
తాను చేసే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషం, ప్రయోజనం ఉండదన్నారు. తనకు తానే పెద్ద విమర్శికురాలినన్నారు. మన తప్పులను, పొరపాట్లను తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని చెప్పారు. అయితే కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదన్నారు. అలాంటి సమయంలో చింతించకుండా, ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోతానని చెప్పారు. "నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. నువ్వు భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోషపెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి" అని సమంత చెప్పుకొచ్చారు.