Adipurush Movie : 'ఆదిపురుష్' ప్రస్తుతం అంతటా మారుమోగుతున్న పేరు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన రూ.500 కోట్ల భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రమిది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొందరు సినీ, వ్యాపార ప్రముఖులు లక్షల రూపాయలు విలువ చేసే కొన్ని వేల టికెట్లను కొనుగోలు చేశారు. అయితే వీటిని వారు కొంతమందికి ఉచితంగా పంచనున్నారు. ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే?
Adipurush Free Tickets : తాము నిర్మించిన సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో మూవీ టీమ్స్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ అప్పుడప్పుడూ ఇలాంటి ట్రిక్స్‌ను అమలు చేస్తుంటారు. కొన్ని సార్లు టికెట్ల్పై ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. సాధారణంగా కొందరు నిర్మాతలు ఒకటి కొంటే మరొక టికెట్ ఫ్రీగా ఇస్తుంటారు. మరికొందరు కాస్త వైవిధ్యంగా ఆలోచించి తమ సినిమా కంటెంట్‌ను బట్టి ఫ్యామిలీ ఎంటర్టైనరైతే మహిళలకు, పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉండే సినిమా ఐతే చిన్నారులకు టికెట్లపై ఆఫర్లు ఇస్తుంటారు. సినిమాలో భాగం ఉన్న వారు చేసే ఈ పని సాధారణ విషయమే అయినా.. సినిమాతో ఏ మాత్రం సంబంధం లేని వారు కూడా ఈ రకమైన ఆఫర్లు ప్రకటిస్తే కాస్త స్పెషలే కదూ. ఇందుకు వేదికైంది పౌరాణిక బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం 'ఆదిపురుష్'.
అనాథలు, వృద్ధుల కోసం పదివేల టికెట్లు!
Adipurush Abhishek Agarwal : మహాకావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. రాముడి గురించి ఈతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన 10 వేలకుపైగా టికెట్లను కొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో ఉండే వారికి ఫ్రీగా పంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
పేద చిన్నారుల కోసం..
Adipurush Ranbeer Kapoor : బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్, సింగర్ అనన్య బిర్లా కూడా తమ వంతుగా ఒక్కొక్కరు 10 వేల టికెట్లను బుక్ చేసి పేద చిన్నారులకు అందిస్తున్నారు.
'మంచు' మనసు..
Adipurush Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు సైతం ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 చిన్నారులకు ఈ సినిమాను ఉచితంగా చూపించనున్నట్టు తెలిపారు.