భారత క్రికెట్లో ఓపెనర్‌గా మంచి గుర్తింపు పొందిన గౌతం గంభీర్ తాజాగా రాజకీయ అరంగ్రేటం చేశారు. తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున పోటీలో నిలిచిన గంభీర్.. ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై మాట్లాడారు.
క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ అదరగొట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఇది ఎంత దూరం వెళుతుందంటారు?
ఎంత అని చెప్పలేను. ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాను. ప్రచారంలో పాల్గొంటున్నాను. నా మనసులో ఉన్నది ఒకటే. ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్ని రోజులు ఉన్నా నిజాయితీగా నడుచుకోవాలని ఆశిస్తున్నా.
తూర్పు దిల్లీ నుంచి మీ ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి అతిషీ మార్లెనా.. నాకు నేనే పోటీ... గంభీర్ హిట్ వికెట్ అయ్యేందుకే వచ్చారని అంటున్నారు? మీరు ఏమంటారు?
నా దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆప్ రాజకీయాలతో దిల్లీ ప్రజలు విసిగిపోయారు. నాలుగున్నర ఏళ్లలో ధర్నాలు, చర్చలు, నాటకాలు తప్ప ఏమీ లేవు. వీటన్నింటికీ సమాధానాలు మే 23న దొరుకుతాయి. రాజకీయాల కోసం ప్రతి విషయంపై ధర్నాలకు దిగటం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది.
భారత్‌లో పాకిస్థాన్‌కు సానుభూతి తెలిపే వారిపై మీ అభిప్రాయం ఏమిటి? వారిని ఎలా చూస్తారు?
ఈ దేశంలో భారత వ్యతిరేకులకు స్థానం లేదు. మీరు దేశానికి మద్దతుగా నిలిస్తే అన్ని లభిస్తాయి. విరుద్ధంగా వ్యవహరిస్తే మీకు ఇక్కడ స్థానం లేదు.