గతం కన్నా మెరుగైన ఫలితాలు ఘన విజయంతో తిరిగి అధికారంతో వచ్చిన భాజపా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం పుదుచ్చేరిలో అంతమేర ఓట్లు సాధించింది. అధికారిక లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, బంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయింది.
మరింత పుంజుకున్న భాజపా
గత ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓటు బ్యాంకును పెంచుకుంటూ వచ్చింది. 1984లో 7.74 శాతంతో రెండు లోక్‌సభ స్థానాల నుంచి క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. 1998లో 25.59 శాతం ఓట్లు సాధించినా 2009 నుంచి 18.8 శాతానికి పడిపోయింది. 2014లో పుంజుకొని.. 31.34 శాతంతో ఎన్నికల్లో విజయభేరి మోగించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ భాజపా ఓటు బ్యాంకు 50 శాతానికి చేరుకునే అవకాశముంది.
రికార్డు స్థాయి నుంచి అట్టడుగుకు..
కాంగ్రెస్ విషయానికి వస్తే స్వతంత్ర భారత మొదటి సార్వత్రికం-1952లో 45 శాతం ఓట్లతో గెలుపొందింది. 1971 వరకు 40 శాతానికి తగ్గకుండా నిలకడగా రాణించింది. అత్యయిక స్థితి ప్రభావంతో 1977లో 34.5 శాతానికి పడిపోయినా మళ్లీ పుంజుకుని 1980లో 42.7 శాతం ఓట్లు కొల్లగొట్టింది. 1984 ఎన్నికల్లో 48.1 శాతానికి చేరుకుంది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణం తర్వాత 1984లోనే జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 49.1 శాతం ఓట్లు సాధించింది హస్తం పార్టీ. 2014 మోదీ ప్రభంజనంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 19.5శాతానికి పడిపోయింది. ప్రస్తుత సార్వత్రికంలో ఇదే సంఖ్యకు అటు ఇటుగా ఉండే అవకాశముంది.
రాష్ట్రాల వారీగా..
కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 6 శాతానికి పడిపోయింది కాంగ్రెస్ ఓటు బ్యాంకు. బిహార్ 7 శాతం, ఆంధ్రప్రదేశ్, సిక్కింలో మరి దారుణంగా 1 శాతానికి పరిమితమయింది. అయితే పంజాబ్ (40శాతం), పుదుచ్చేరి (57శాతం)లో రాణించింది.
భాజపా మాత్రం గతంలో గెలిచిన స్థానాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా పట్టు సాధించింది. బంగాల్లో 40 శాతం, జమ్ముకశ్మీర్‌లో 46 శాతం రావటం విశేషం. ఇవే రాష్ట్రాల్లో 2014 ఎన్నికల సమయంలో కూటమి కట్టిన భాజపా.. ప్రస్తుతం ఒంటరిగా పోరాడింది. అనూహ్యంగా తెలంగాణలో 20 శాతం, ఒడిశాలో 38 శాతం ఓట్లు సాధించింది కాషాయ పార్టీ.
సీట్ల పరంగానూ భాజపా గట్టిగా నిలబడింది. గుజరాత్-26, హరియాణా-10, దిల్లీ-7, రాజస్థాన్-25 సహా మొత్తం 8 రాష్ట్రాలను పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో భారీ ఆధిక్యం సాధించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క సీటు గెలవలేకపోయింది కమల దళం.
ఇదీ చూడండి: తీర్పు 2019: భాజపా విజయానికి పది కారణాలు