మోదీ ప్రభంజనం..! 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వినిపించిన మాట. ఆ స్థాయిలో ఘన విజయం సాధించింది భాజపా. కానీ... 39 నియోజకవర్గాలున్న తమిళనాడులో ఆ పార్టీ గెలిచింది ఒకే ఒక్క సీటు. అది కూడా కూటమిలో భాగంగా ఉండి. తమిళనాడులో భాజపా బలం ఎంతో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.
కాంగ్రెస్‌దీ అదే తీరు. భాజపాతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం కాస్త ఎక్కువే అయినా... తమిళనాడులో మాత్రం గడ్డు పరిస్థితి.
2019 సార్వత్రిక సమరం వేదికగా తమిళనాడులో ఉనికి చాటుకోవాలని భావిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. అందుకోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగాయి. ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి మరణాంతరం తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు తమకు లాభిస్తాయన్నది భాజపా, కాంగ్రెస్ ఆశ.
అస్తిత్వం కోసం సుదీర్ఘ పోరాటం
తమిళనాడులో 1998 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా బోణీ కొట్టింది. అదీ అన్నాడీఎంకే, ఎండీఎంకే, పీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే సాధ్యమైంది. డీఎంకే పొత్తుతో మరింత పుంజుకుని 1999లో నాలుగు సీట్లలో విజయం సాధించింది భాజపా. అయితే... మతవాదాన్ని భాజపా విడనాడలేదని చెబుతూ ఐదేళ్ల తర్వాత కమలదళంతో తెగదెంపులు చేసుకుంది డీఎంకే.
2004 ఎన్నికల్లో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది భాజపా. కూటమిని ప్రజలు తిరస్కరించారు. ఒక్క సీటైనా గెలవలేకపోయారు. ఫలితాలపై అసంతృప్తి వ్యక్తంచేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. మరెప్పుడూ భాజపాతో పొత్తు పెట్టుకోనని శపథం చేశారు. మరణం వరకూ ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నారు. డీఎంకే కూడా కమలదళానికి దూరంగానే ఉంటూ వచ్చింది. అలా 2009లో ఒంటరిగానే ప్రయాణం చేసింది భాజపా.
మోదీ ప్రభంజనంతో..
2014 ఎన్నికల్లో డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే పార్టీలతో భాజపాకు పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు సాధించగలిగిందీ కూటమి. అయినా పొత్తు విచ్ఛిన్నం అయ్యేందుకు ఎన్నో రోజులు పట్టలేదు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సేకు మోదీ ఆహ్వానం పంపటంపై తమిళ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి నుంచి వైదొలిగాయి.