తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: లెక్కలు మార్చిన అంబేడ్కర్

మహారాష్ట్రలో రాజకీయం రెండు స్తంభాలాట. సోలాపుర్​లో మాత్రం పరిస్థితి భిన్నం. అంబేడ్కర్​ మనుమడి రాకతో అక్కడ పోరు త్రిముఖమైంది. గెలుపోటములపై చర్చ జోరందుకుంది.

భారత్​ భేరి: లెక్కలు మార్చిన అంబేడ్కర్

By

Published : Apr 14, 2019, 6:23 PM IST

సోలాపుర్​ నుంచి బరిలోకి దిగిన ప్రకాశ్​ అంబేడ్కర్

ప్రకాశ్​ అంబేడ్కర్​... రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్​ మనుమడు, భరీపా బహుజన్​ మహాసంఘ్​ పార్టీ అధినేత. మహారాష్ట్రలో ఈ పార్టీ ప్రభావం చాలా తక్కువ. బీబీఎమ్​ మాత్రమే కాదు... మిగిలిన చిన్నపార్టీలదీ అదే తీరు. ఆ రాష్ట్ర రాజకీయం తిరిగేది భాజపా-శివసేన, కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటముల చుట్టూనే.

సార్వత్రిక ఎన్నికల వేళ మాత్రం ప్రకాశ్​ అంబేడ్కర్​ పేరు బాగా వినిపిస్తోంది. బీబీపీ ఏర్పాటు చేసిన 'వంచిత్​ బహుజన అఘాడీ'(వీబీఏ), ఏఐఎమ్ఐఎమ్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సోలాపుర్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు ప్రకాశ్​. ఈ పరిణామం... ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్​కు ముచ్చెమటలు పట్టిస్తోంది.

సోలాపుర్​ విశేషాలు

భాజపా అభ్యర్థి : జైసిద్దేశ్వర్ శివాచార్య

కాంగ్రెస్​ అభ్యర్థి : సుశీల్​ కుమార్​ శిందే

వీబీఏ-ఎంఐఎం అభ్యర్థి : ప్రకాశ్​ అంబేడ్కర్​

ఓటర్లు : 17,02,755

పోలింగ్ తేదీ : ఏప్రిల్​ 18

ప్రధాన సమస్యలు : తాగునీరు, నిరుద్యోగం

సోలాపుర్... కాంగ్రెస్​కు కంచుకోట.​ అక్కడ ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.

లింగాయత్​ ఓట్లపై భాజపా గురి...

కాంగ్రెస్​ కంచుకోట అయినప్పటికీ... మోదీ ప్రభంజనంతో సోలాపుర్​ 2014లో భాజపా వశమైంది. కేంద్ర మాజీ మంత్రి సుశీల్​ కుమార్​ శిందేపై లక్షన్నర ఓట్లతో గెలిచారు శరద్​ బన్సోడే.
ప్రస్తుత పరిస్థితుల్లో బన్సోడే మరోసారి విజయం సాధించడం కష్టమని భావించింది భాజపా. ఆయన్ను పక్కనబెట్టింది. లింగాయత్​ వర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు మహాస్వామి జైసిద్ధేశ్వర్​ శివాచార్యను రంగంలోకి దింపింది.

సానుకూలతలు...

⦁ సోలాపుర్​లో 3 లక్షల 60 వేల లింగాయత్​ ఓట్లున్నాయి. అవన్నీ గంపగుత్తగా శివాచార్యకే పడతాయని భాజపా నమ్మకం.

⦁ కన్నడ, మరాఠీ, హిందీ ఇలా మూడు భాషల్లో మాడ్లగలగటం వల్ల ఓటర్లకు దగ్గరయ్యే అవకాశం.

⦁ అగ్రవర్ణ మరాఠా ఓట్లు, పద్మశాలి ఓటు బ్యాంకుపై విశ్వాసం.

ప్రతికూలతలు...

⦁ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాపై ప్రజా వ్యతిరేకత.

⦁ నిరుద్యోగం, తాగునీరు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అధికార భాజపాకు మళ్లీ ఓటు వేస్తారా అనేది అనుమానమే.

⦁ మైనార్టీ, ఎస్సీల ఓట్లు సిద్ధేశ్వర్ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పునర్​వైభవం కోసం....

సోలాపుర్​ నుంచి మూడు సార్లు సుశీల్​ కుమార్ శిందే గెలిచారు. నాలుగోసారి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

సానుకూలతలు...

⦁ సిట్టింగ్​ ఎంపీ శరద్​ బన్సోడే​కు భాజపా ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే శిందేకు కలిసొచ్చే అవకాశం.

⦁ వెనుకబడిన వర్గానికి చెందడం వల్ల శిందేకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు బలంగా ఉంది.

⦁ మరాఠా ఓటర్లు ఈసారి కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపే అవకాశం.

⦁ 56 పార్టీలతో ఏర్పడిన మహాకూటమి మద్దతు.

⦁ సోలాపుర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని సోలాపుర్​ సిటీ సెంట్రల్​ శాసనసభ స్థానానికి శిందే కుమార్తె ప్రణీతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెకు ఉన్న మంచి పేరు శిందేకు కలిసొచ్చే అవకాశముంది.

ప్రతికూలతలు...

⦁ పట్టణ ప్రాంతంలో లింగాయత్, ముస్లిం, ఎస్సీల జనాభా ఎక్కువ. వీరి ఓట్లు శిందేకు పడటం కష్టం.

దిగ్గజాలతో ఢీ....

సోలాపుర్​తో పాటు అకోలా పార్లమెంటు స్థానంలోనూ పోటీ చేస్తున్నారు ప్రకాశ్​ అంబేడ్కర్​.

సానుకూలతలు...

⦁ చిన్న పార్టీలను ఏకతాటిపైకి తేవడం.

⦁ 2.5 లక్షల ఎస్సీ ఓట్లు, 3 లక్షల ధన్​గర్ ఓట్లు, 3 లక్షల మైనార్టీల ఓట్లు, 3.5లక్షల మరాఠా ఓట్లు తమకే పడతాయని నమ్మకం.

⦁ మజ్లిస్​తో పొత్తు వల్ల మైనార్టీ ఓట్లు పడే అవకాశం.

ప్రతికూలతలు...

⦁ సొంత నియోజకవర్గం కాకపోవడం.

⦁ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్​ను కాదని అంబేడ్కర్​ వైపు మొగ్గు చూపుతాయా అనేది అనుమానమే.

⦁ ప్రధాన పార్టీలతో పోరు కావడం వల్ల వారికి పడే సంప్రదాయ ఓట్లతో ఇబ్బంది.

ప్రకాశ్ అంబేడ్కర్​ ఎవరి ఓట్లు ఏ స్థాయిలో చీల్చుతారన్నదే ఇప్పుడు ప్రశ్న. సమాధానం మే 23న తెలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details