2006 జులై... బంగాల్లోని సింగూరు. వ్యవసాయ భూముల్లో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమించారు మమతా బెనర్జీ. అప్పుడామె ఊహించి ఉండరు... తాను సరికొత్త చరిత్ర లిఖిస్తానని. వామపక్షాల కంచుకోటను కూల్చుతానని.
2019 ఏప్రిల్... మరోమారు ఉద్యమ సింహంలా దూసుకెళ్తున్నారు మమతా బెనర్జీ. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది సింగూరు తరహా ప్రాజెక్టులను కాదు. పోరాడుతున్నది రాష్ట్రంలోని ప్రత్యర్థులతో అసలే కాదు. ఆమె పోరాటం ప్రధాని నరేంద్రమోదీపై. ఆయన విధానాలపై.
'నబన్న' పటిష్ఠం... హస్తిన లక్ష్యం...!
నబన్న... హావ్డాలోని సచివాలయం పేరు. బంగాల్ అధికార కేంద్రం. అక్కడ పటిష్ఠ స్థితిలో ఉన్నారు మమత. 2016 శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది తృణమూల్ కాంగ్రెస్. 294 నియోజకవర్గాల్లో 211 సీట్లు ఆ పార్టీవే. 32 స్థానాలకే పరిమితమై... కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయిన దక్కించుకోలేకపోయింది వామపక్ష కూటమి. 44 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైంది.
స్వరాష్ట్రంలో తిరుగులేని బలంతో... ఇప్పుడు హస్తినపై గురిపెట్టారు 64ఏళ్ల మమత.
"జాతీయస్థాయిలో మేము కీలక పాత్ర పోషిస్తాం. బంగాల్ నుంచి అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకోగలిగితే... తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో మేము కీలకం అవుతాం.
ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. ఆ జాబితాలో మేము ముందుంటాం. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మా పార్టీ అధినేత్రికి పార్టీలకు అతీతంగా మద్దతు ఉంది."
-పేరు చెప్పేందుకు ఇష్టపడని టీఎంసీ నేత
మోదీ వర్సెస్ దీదీ
నోట్ల రద్దు, జీఎస్టీ, జాతీయ పౌర రిజిస్టర్, పుల్వామా ఉగ్రదాడి, సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థల దుర్వినియోగం వంటి అంశాలే దీదీ అస్త్రాలు. ప్రతి సందర్భంలోనూ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడుతున్నారు మమత. తద్వారా... మోదీని ఎదుర్కోగల విపక్ష నేత తానేననే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
సైద్ధాంతిక సారూప్యం లేకపోయినా మోదీని ఢీకొట్టే లక్ష్యంతో ఏర్పడ్డ కూటమికి సారథిగా నిలవాలన్నది దీదీ ఆలోచన. జనవరిలో కోల్కతా ర్యాలీ పేరుతో 23 పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వ్యూహంలో భాగమే.
అంత సులువు కాదు...!