కేరళలో గెలుపైనా... ఓటమైనా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా... అధికార, ప్రతిపక్ష హోదాలు ఆ రెండింటివే. జాతీయ పార్టీ అయిన భాజపాది అక్కడ అస్తిత్వ పోరాటమే. ఇప్పుడు పరిస్థితి మారింది. కమల దళానికి సరికొత్త ఆయుధం చిక్కింది. శబరిమల వివాదమే... ఎన్నికల అస్త్రమైంది.
పతనంతిట్ట... కేరళలోని ఓ జిల్లా. దేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉండే ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిన జిల్లా. రాష్ట్రంలో అతి తక్కువ పేదరికంతో విద్య, ఉద్యోగ, ఆదాయాల్లో దూసుకెళ్తోంది పతనంతిట్ట. 96.55 శాతం అక్షరాస్యత కలిగి ఉంది. ప్రఖ్యాత దేవాలయం శబరిమల ఉన్నది ఈ జిల్లాలోనే.
రాజకీయ ముఖచిత్రం...
పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో పొటీ ఎప్పుడూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, సీపీఎం నేతృత్వంలోని లెఫ్టిస్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మధ్యే. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆంటోని విజయం సాధించారు.
బరిలోకి భాజపా...
శబరిమల ఆలయ వివాదంతో పతనంతిట్ట రాజకీయ ముఖచిత్రం మారింది. అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడూ రెండు కూటముల మధ్య ఉండే పోటీ త్రిముఖం అయింది. ఆలయ సంస్కృతి, ఆనవాయితీనే ప్రచారాస్త్రాలుగా చేసుకొని తెరపైకి భాజపా వచ్చింది. హిందూ సంస్కృతి, ఆచారాలను కాపాడేది మోదీ ప్రభుత్వమేనంటూ బరిలోకి దిగింది.
కమలం ఆశలు ఆ ఒక్కరిపైనే...!
కె. సురేంద్రన్... పతనంతిట్ట భాజపా ప్రధాన కార్యదర్శి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు ఆయన. విజయన్ ప్రభుత్వం ఆలయ సంస్కృతిని కాలరాస్తోందంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సురేంద్రన్‌పై పలు కేసులు నమోదు చేశారు రాష్ట్ర పోలీసులు. ఒకసారి అరెస్టు చేశారు.
భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సురేంద్రన్‌కు పతనంతిట్ట లోక్‌సభ టికెట్ ఇచ్చింది భాజపా. ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు తమ విజయం ఎంతో అవసరమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది.
హాట్రిక్ లక్ష్యంగా ఆంటోని...