సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా విజయఢంకా నమోదు చేసింది. ఈ గెలుపుతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత స్పష్టమైన మెజార్టీతో రెండోసారి ప్రధాని కానున్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.
మూడుసార్లు నెహ్రూ విజయం..
స్వతంత్ర భారతదేశంలో తొలిసారి 1951లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు 489 పార్లమెంటు స్థానాలుండగా.. 364 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధాని అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 45 శాతం ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. అనంతరం 1957, 1962లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.
1957 ఎన్నికల్లో నెహ్రూ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటుతో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరగడం, 1955 హిందు వివాహ చట్టం, దేశంలో ఆహార సంక్షోభం లాంటి సమస్యలు నెహ్రూ ప్రభుత్వాన్ని వెంటాడాయి. అయినప్పటికీ 1957 ఎన్నికల్లో 371 సీట్లతో అఖండ విజయం సాధించింది కాంగ్రెస్. గతంలో కంటే మెరుగ్గా ఓట్ల శాతాన్ని పెంచుకుంది.
1962లో కాంగ్రెస్ మళ్లీ విజయదుందుభి మోగించింది. 494 పార్లమెంటు స్థానాల్లో 361 సీట్లు కైవసం చేసుకుని మూడో సారి ప్రధాని అయ్యారు నెహ్రూ.