Youngman Attack on Young Woman: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలానికి చెందిన గుజ్జల భాస్కర్.. అదే గ్రామానికి చెందిన బాలికను.. కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. బాలిక తండ్రి పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందారు. ఆయన మృతితో భార్యకు ఉద్యోగం ఇచ్చారు. తన తల్లికి చదువు రాకపోవడంతో.. ఆమెకు బదులు బాలిక పోస్ట్‌ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇటీవలే కళ్యాణదుర్గానికి బదిలీ అవ్వడంతో అక్కడకు మకాం మార్చారు. అయినా కూడా భాస్కర్ వేధింపులు ఆపలేదు.
పెళ్లిచేసుకోవాలని లేకుంటే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అన్న వరస అవుతావని చెప్పి ఆమె పెళ్లికి నిరాకరించింది. కోపంతో పగ పెంచుకున్న భాస్కర్.. రెండు రోజుల క్రితం ఒంటరిగా ఉన్న బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో వాహనంలో నుంచి బాలిక కిందకు దూకింది. తనను పెళ్లి చేసుకోదనే కోపంతో.. బాలికకు తీవ్ర గాయాలైనా కనికరం లేకుండా కారుతో ఢీకొట్టాడు.
ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో.. భాస్కర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో కారు లారీని ఢీకొట్టి అదుపుతప్పి.. చెట్ల పొదల్లో బోల్తా పడింది. స్వల్ప గాయాలతో భాస్కర్ బయటపడ్డాడు. స్థానికులు బాలికను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి తల్లికి సమాచారమిచ్చారు. బాలిక తలకు బలమైన గాయమైంది. కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.