తన సమస్యను పోలీసులు పట్టించుకోవడం లేదని, తన చావుకు కొందరు కుటుంబ సభ్యులు కారణమంటూ... ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన పరశురాములు, వరలక్ష్మి భార్యాభర్తలు. వారి మధ్య స్వల్ప గొడవ జరగడం వల్ల... అది కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. భార్య తరుఫు బంధువులు తనను వేధిస్తున్నారని... ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
తన సమస్యను పరిష్కరిస్తారని వస్తే పోలీసులు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. తన చావుకు కొందరు కుటుంబ సభ్యులు కారణమంటూ లేఖ రాసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఆందోళన చెందిన పరశురాములు మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద... తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళ లేక పరుగులు పెట్టడంతో... స్థానికులు అతనిపై నీళ్లు చల్లి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా... ఇప్పటివరకు ఆ వ్యక్తిని చూడలేదని చెప్పారు. వారి గొడవలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాలుడిని కొట్టిన పెదనాన్నపై ఫిర్యాదు