Suicide Attempt: తన కూతురి మరణానికి కారణమైన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. పోలీసులు దుర్భాషలాడటమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లిలో జరిగింది.
సల్కునూరుకు చెందిన తుపాకుల మల్లేష్, సరిత దంపతులకు ఇద్దరు సంతానం కాగా.. కూతురు మిర్యాలగూడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ అమ్మాయి తన స్నేహితులతో చనువుగా ఉన్న ఫొటోలను అదే గ్రామానికి చెందిన 6వ వార్డు మెంబర్ సైదులు దొంగచాటుగా చిత్రీకరించి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ ఫొటోలను చూసిన తల్లిదండ్రులు.. కూతురిని కాస్త మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయి.. డిసెంబర్ 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు మృతికి సైదులు అందించిన తప్పుడు సమాచారమే కారణమంటూ తల్లిదండ్రులు వేములపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.