ఇద్దరు పిల్లలు, భర్తతో ఆనందంగా ఉన్న ఆ ఇల్లాలి జీవితాన్ని ఓ రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసింది. కుటుంబంతో కలిసి కారులో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో కంటైనర్‌ని ఢీకొని ఓ మహిళ చనిపోయింది.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ మృతి - telangana news
ఊహించని ప్రమాదం ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. దైవ దర్శనానికి కారులో వెళ్లి వస్తుండగా.. ఓ కంటైనర్ మృత్యు రూపంలో కబలించింది. ఇద్దరు పిల్లలు, ప్రేమించే భర్త నుంచి ఆ ఇల్లాలిని విధి అర్థాంతరంగా దూరం చేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వద్ద డ్రైవర్‌గా విధులు నిర్బహిస్తున్న వేణు సాగర్, భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాయక స్వామిని దర్శించుకుని తిరిగి కారులో బయలుదేరారు. మహబూబ్‌నగర్ తిరిగి వస్తుండగా.. నాటవెళ్లి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కంటైనర్ ఆకస్మికంగా రహదారిపై బ్రేక్ వేయడంతో నిలిచిపోయింది. కారులో కంటైనర్ వెనకే వస్తున్న వేణు పరిస్థితిని అర్థం చేసుకుని, అప్రమత్తమై కారును ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయిన కారు అదుపుకాకపోవటంతో కంటైనర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న జ్యోతి, వేణుతో పాటు చిన్నారులకు గాయాలయ్యాయి. జ్యోతిని జిల్లా ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతు మృతి చెందినట్లు ఎస్సై నాగశేఖర్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఏపీ: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం