అమ్మ... నేనేం పాపం చేశాను. నవమాసాలు మోసి నన్ను కన్నావ్.. మీ ప్రేమకు ప్రతిరూపంగా జన్మించాను కదా. అల్లారుముద్దుగా పెంచావ్. మరేమైందమ్మా .. ఇలా చేశావ్. ఆప్యాయత, అనురాగం పంచాల్సిన నువ్వు.. నీ సుఖం, స్వార్థం చూసుకున్నావా..!
అయినా నేనేం తప్పు చేశానమ్మా... నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో తెలియని, తెలుసుకోలేని వయసు నాది. పాలామృతం పంచిన చేతులతో.. పురుగుల మందు తాగిస్తావని ఊహించగలనా..!
నేనేం అనలేననే కదూ ఇంతటి దారుణానికి ఒడిగట్టావ్.. నువ్వు నన్ను, నా నమ్మకాన్నే కాదు, మాతృత్వాన్నే మోసం చేసి.. మాయని మచ్చను మిగిల్చావ్.. అమ్మా...
ఇదీ... ఓ పసిపాప ఆత్మఘోష...
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పోతన్నకు.. భైంసా మండలం బేగం గ్రామానికి చెందిన ఓ మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత కొన్నేళ్లుగా ఆ మహిళ.. బొరిగాంకు చెందిన శ్రీకాంత్ రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలిసి.. తరచూ గొడవలు సైతం జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ ఆదివారం.. తన మూడేళ్ల కుమార్తెతో కలిసి.. శ్రీకాంత్‌రెడ్డి వెంట ఇళ్లు విడిచి వెళ్లిపోయింది.
అనంతరం ఆర్మూర్, నిర్మల్‌లో రెండు రోజుల గడిపాక.. నిర్మల్‌కు తీసుకువచ్చి శ్రీకాంత్‌రెడ్డి విడిచివెళ్లిపోయాడని బాధితురాలు తెలిపింది. మోసపోయానని గ్రహించి.. కుమార్తెకు విషం ఇచ్చి తానూ కొంత తాగినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి మరణించింది. బాధితురాలు ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన బాధితురాలి భర్త అదృశ్యమయ్యారు. ఓ చెరువు వద్ద ఆయన ద్విచక్రవాహనం, చెప్పులు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీచూడండి:GIRL SUICIDE: ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం.. తట్టుకోలేక బాలిక ఆత్మహత్య