Ghatkesar road accident cctv footage: అతివేగం వద్దు, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు వాహనదారుల తీరు మారడం లేదు. వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఎదుటి వారి ప్రాణాలు బలై పోతున్నాయి. అదీ రాత్రివేళల్లో కనీస జాగ్రత్తలు, అప్రమత్తత లేకుండా వాహనాలు నడుపుతుండటం భయాందోళనకు దారితీస్తోంది. మద్యం మత్తులో కారు నడిపి ఓ మహిళ మృతికి కారకులయ్యారు ఈ ఇంజినీరింగ్ విద్యార్థులు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తులో
కళాశాల ముగిసిన తర్వాత కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు.. మద్యం సేవించి కారులో బయలుదేరారు. అదే సమయంలో ఎదులాబాద్‌కు చెందిన బత్తుల హనుమాన్ దాస్ గౌడ్.. భార్య నిరంజనితో కలిసి ద్విచక్ర వాహనంపై ఘట్కేసర్ నుంచి ఎదులాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన కారు.. వారిని ఢీ కొట్టింది. దీంతో నిరంజని అక్కడక్కడే మృతి చెందగా.. హనుమాన్ దాస్ గౌడ్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.