నల్గొండ మండలం కాతాల్గూడ గ్రామానికి చెందిన దండెంపల్లి కవిత.. తన భూమి విషయంలో పోలీసులు న్యాయం చేయడం లేదని.. అసహనానికిలోనై నల్గొండ డీఎస్పీ కార్యాలయం ముందు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్గూడలోని భూమి విషయంలో గత మూడు నెలలుగా భూమి విషయంలో గొడవ జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని కాతాల్గూతకు చెందిన 503 సర్వే నెంబర్లో కవితకు 18 గుంటల భూమి ఉంది. తన భూమిని యాదయ్య అనే వ్యక్తి కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆమె పోలీసులను ఆశ్రయించినా.. న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆర్డీవోతో పాటు తహసీల్దార్, డీఎస్పీ బాధితురాలి భూమిని పరిశీలించారని వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి యాదయ్యకు అనుకూలంగా ఉందని.. సర్వేయర్ నివేదిక వచ్చాక బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.