తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2022, 8:58 AM IST

ETV Bharat / crime

కి'లేడీ' పోలీసు వేషం వేసి రూ.లక్షల్లో మోసం

Cheating in The Name Of SI : ఉద్యోగాల వేటలో ఎంతో మంది యువతీయువకులు కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని అనగానే.. వారికి లక్షల్లో డబ్బులు ముట్టజెబుతున్నారు. తీరా కొలువు కోసం కాల్ చేస్తే ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇటు ఉద్యోగం రాక.. అటు ఉన్న డబ్బంతా పోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఓ మహిళ.. తనని తాను ఎస్సైగా చెప్పుకుని.. ఓ యువకుడి వద్ద రూ.10 లక్షలు తీసుకుని అతనికి కుచ్చుటోపీ పెట్టింది. ఇలా నిరుద్యోగులు, మల్లన్న సాగర్ ముంపు బాధితులు.. ఇలా దొరికిన వాళ్లందరికి మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బు కాజేసింది. చివరకు పోలీసులకు చేజిక్కి కటకటాలపాలైంది.

Cheating in The Name Of SI
Cheating in The Name Of SI

Cheating in The Name Of SI : ప్రతిభ కలిగిన మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రచారం... ఉద్యోగాల పేరిట యువకులకు గాలం.. రూ.లక్షల్లో వసూళ్లు.. చివరికి అందరికీ కుచ్చుటోపీ! ఇదంతా ఓ కి‘లేడీ’ ఆడిన నాటకం.. 2021 డిసెంబరులో సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పోలీసుశాఖలో ఉద్యోగానికి ఆశపడి ఎస్‌ఐగా పరిచయమైన మహిళకు రూ.10లక్షలు ముట్టజెప్పాడు. తరువాత ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆమె నాలుగు రోజుల కిందట పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఆమె సిద్దిపేట సహా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో పదుల సంఖ్యలో యువకులను మోసగించినట్లు తేలింది.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు సిద్దిపేట గ్రామీణ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..

Cheating in The Name Of SI in Siddipet : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) గ్రామానికి చెందిన విజయభారతి డిగ్రీ పూర్తిచేసింది. 2018లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నా ఎంపిక కాలేదు. గతంలో మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. రూ.13లక్షల వరకు అప్పులు తెచ్చి అతగాడికి ముట్టజెప్పి మోసపోయింది. ఆ అప్పులు తీర్చేందుకు ఎస్‌ఐ అవతారమెత్తింది. ఎస్‌ఐ పరీక్షలకు సంబంధించి నకిలీ ఫలితాలు, ధ్రువపత్రాలు సృష్టించింది. ఎస్‌ఐగా ఎంపికయినట్టు నమ్మించి ప్రముఖులతో సత్కారాలు అందుకొంది. ఆ ఫొటోలను చూపిస్తూ పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని ఉచ్చులోకి దింపింది. నారాయణరావుపేటకు చెందిన ఓ యువకుడి నుంచి రూ.10లక్షలు గుంజింది. అతని ద్వారా మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన పలువురు బాధితుల నుంచి బాండ్‌పేపర్‌ రాయించుకొని రూ.లక్షలు తీసుకుంది. ఎస్‌ఐని అంటూ వరంగల్‌కు చెందిన ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకుంది. వారికిపుడు నాలుగు నెలల బాబు.

సాంకేతికతతో మాయచేసి..హైదరాబాద్‌ చైతన్యపురిలో ఉంటూ యాభై మంది నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసింది. నెలల పాటు టవర్‌ లోకేషన్‌ తెలియనీయకుండా సాంకేతికత ఆధారంగా పక్కదారి పట్టించింది. ఈ క్రమంలో సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ అమరేందర్‌ విచారణ ముమ్మరం చేశారు. భర్తను పట్టుకొని అతనితో ఫోన్‌ చేయించగా హుస్నాబాద్‌లో ఉన్నట్టు తెలియగానే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details