ఆంధ్రప్రదేశ్‌లో వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. కాపలాదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం మేరకు నలుగురు వ్యక్తుల ప్రమేయంపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై.. నిశితంగా విచారణ జరుపుతోంది. 2 నెలల నుంచి ఈ నలుగురిని వరుసగా విచారణకు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే సునీల్ యాదవ్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం ఈ నలుగురి ఇళ్లే లక్ష్యంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. వారి ఇళ్లలో కొన్ని ఆయుధాలు, చొక్కాలు, బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లో.. రక్తపు మరకలతో కూడిన చొక్కాను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దస్తగిరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువారం ఉదయమే దస్తగిరితో పాటు.. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌ను వెంటబెట్టుకుని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. అనంతరం పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఉదయం నుంచి రాత్రి వరకు వారిని ప్రశ్నించారు. వీరితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించారు. సాయంత్రం కీలక అనుమానితుడు, ఈసీ గంగిరెడ్డి సమీప బంధువు, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని విచారించారు. వివేకా కుమార్తె సునీత.. హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న 15 మంది అనుమానితుల్లో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి పేరూ ఉంది. ఈయనతో పాటు చెప్పుల దుకాణం యజమాని మున్నాను సీబీఐ బృందం ప్రశ్నించింది.