తెలంగాణ

telangana

ETV Bharat / crime

వేషం మార్చి.. భాష నేర్చి.. వెంటాడారు.. అరెస్టు చేశారు - తెలంగాణలో మిషన్ సౌత్ ఇండియా ఆపరేషన్

Mission South India : రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ ఓ గ్రామ సర్పంచ్‌ను కోర్టు ముందే అతి కిరాకతకంగా నరికి వసీమ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పరారయ్యాడు. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న వసీమ్ & గ్యాంగ్‌ అప్పటి నుంచి తమ లొకేషన్‌ను మారుస్తూ పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నారు. ఈ నిందితులను పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్‌ పోలీసులు మిషన్ సౌత్ ఇండియా పేరుతో ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చి 15 రోజులు సినీ ఫక్కీలో వారి కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు ఏపీ, తెలంగాణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Mission South India
Mission South India

By

Published : Jun 16, 2022, 10:09 AM IST

Mission South India : ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేరస్థులను తెలుగు రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. హరిద్వార్‌లో 2019 డిసెంబర్‌లో ఓ గ్రామ సర్పంచ్‌ను అతికిరాతకంగా హత్య చేసిన వాసిమ్ అనే వ్యక్తి, అతని గ్యాంగ్‌ అక్కణ్నుంచి పరారై తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ వారి స్థావరాన్ని మారుస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. కానీ వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకోవాలని సంకల్పించిన ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసులు మిషన్ సౌత్ ఇండియా పేరుతో ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను విజయవాడ, హైదరాబాద్‌లలో పట్టుకుని అరెస్టు చేశారు.

Uttarakhand Police Mission South India : ఈ నిందితులను పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసులు చేపట్టిన మిషన్ సౌత్ ఇండియాలో భాగంగా మొదట తెలంగాణకు చేరుకున్నారు. తెలంగాణలో వారు తమ వేషధారణను మార్చుకుని.. తెలుగు వారిలా ఇక్కడి జనంలో ఒకరిగా మారిపోయారు. నెమ్మదిగా తమ మిషన్‌ని మొదలు పెట్టి ఎట్టకేలకు విజయవంతమయ్యారు. వసీమ్‌ను పట్టించిన వారికి రూ.50వేల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. వసీమ్‌ను ఏపీలోని విజయవాడలో అరెస్టు చేయగా.. ఇతడి గ్యాంగ్‌లో మరో ఇద్దరు సల్మాన్, రుబీనాలను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు వసీమ్ కుటుంబ సభ్యులేనని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. సల్మాన్ వసీమ్ సోదరుడు కాగా.. రుబీనా.. వసీమ్ భార్య సోదరి.

Uttarakhand STF Police : భాష తెలియని రాష్ట్రంలో.. వేషధారణ మార్చుకుని నిందితులను పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ పోలీసులు చాలా శ్రమపడ్డారు. 15 రోజులు వేషం మార్చుకుని తిరుగుతూ వసీమ్ అండ్ గ్యాంగ్ కోసం వెతికారు. బుర్ఖాలు ధరించి వారి కోసం రెక్కీ నిర్వహించారు. నిందితులు తరచూ లొకేషన్లు మారుస్తూ ఉండటం వల్ల వారిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా తెలుగు భాష తెలియకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది.

డిసెంబర్ 21, 2021లో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో వసీమ్, అతని సోదరుడు సల్మాన్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసులు, గంగానహర్ పోలీసులు అత్తాపూర్‌లో అర్ధరాత్రి పూట దాడులు నిర్వహించారు. వసీమ్‌ను దాదాపుగా అరెస్టు చేశారు. కానీ అతడి బంధువులు, స్థానికులు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో ఈ గొడవల్లో వసీమ్ అక్కణ్నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడిలో గుంపు కానిస్టేబుల్ చమన్ కుమార్, ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ సభ్యులు, రాజేంద్రనగర్‌కు చెందిన కానిస్టేబుల్ ఫయాజ్ కళ్లలో కారం పొడి చల్లారు. పోలీసులపై దాడికి పాల్పడినందుకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 353, 323ల కింద రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ దాడుల్లో వసీమ్ భార్య షమా పర్వీన్‌ను మాత్రం పోలీసులు పట్టుకోగలిగారు. ప్రస్తుతం పర్వీన్ దేహ్రాదూన్‌ జైల్లో ఉంది.

ఈ కేసులో ఇప్పటికే పర్వీన్ అరెస్టు కాగా.. తాజాగా విజయవాడలో వసీమ్, హైదరాబాద్‌లో సల్మాన్, రుబీనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302, 212, 201, 120బీ కింద గంగానహర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వసీమ్, పర్వీన్‌లు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలోని ఖాలాపర్ గ్రామస్థులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details