సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పన్యాల నవీన్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నవీన్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పని భారం ఎక్కువవుతుందని ఇటీవల తల్లిదండ్రులకు తెలిపాడు. సానుకూలంగా స్పందించిన వారు.. తనకు నచ్చిన పని చేసుకోమని నవీన్‌రెడ్డికి సూచించారు. ఉద్యోగం మానేస్తే తల్లిదండ్రులు బాధపడతారని మనస్తాపం చెందిన నవీన్.. రోజులాగే వ్యవసాయ పొలం వద్ద వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు వెళ్లి అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ నవీన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. విగతజీవిగా కనిపించాడు. 'అమ్మా-నాన్న సారీ.. నా చావుకు ఎవరూ కారణం కాదు' అంటూ సూసైడ్ నోట్ రాసుకుని జేబులో పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.