Boy Kidnap in Mattevada :'నీ జ్ఞాపకాలే ఊపిరిగా బతుకుతున్నాం చిన్నా.. త్వరగా తిరిగి రా..!' - two years boy goes missing in warangal district
తల్లిదగ్గరకు కుమారుడితో వచ్చిన ఆ మహిళ రాత్రి నిద్రిస్తుండగా.. తన పక్కనే పడుకున్న ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోయారు. తెల్లవారుజాము లేచి చూసే సరికి పక్కన తన బాబు కనిపించకపోయేసరికి కంగారుపడిన ఆ తల్లి.. చుట్టుపక్కలంతా వెతికింది. ఎంత వెతికినా కొడుకు జాడ కానరాకపోయేసరి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 12 రోజులైనా తన పసిప్రాణం ఆచూకీ తెలియక ఆ మాతృమూర్తి తల్లడిల్లుతోంది. తన బుజ్జాయి నవ్వు ముఖం చూసి పదిరోజులైందని.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.
Boy Kidnap in Mattevada
By
Published : Oct 23, 2021, 12:47 PM IST
"ఓ బిడ్డా ఎక్కడున్నావ్! మా ఒక్కగానొక్క గారాల పట్టివి. నీ నవ్వుల ముఖం చూసి పదిరోజులు దాటింది. నీ ముద్దుముద్దు మాటలు విని ఎన్ని రోజులయింది కన్నా.. నీ బుడిబుడి అడుగులు, నీ ముసిముసి నవ్వులు చూస్తూ మురిసిపోయేవాళ్లం. ఇప్పుడు ఆ నవ్వు దూరమై మాకు కన్నీటి శోకమే మిగిలింది. ఆస్తిపాస్తులేవీ లేకున్నా నువ్వే మా సంపద అనుకొని సంబరపడిపోయాం. ఆకలై నువ్వు ఏడుస్తుంటే కడుపునిండా నీకు పాలిస్తూ పులకరించిపోయేదాన్ని.. ఇప్పుడు ఏం తింటున్నావో ఎలా ఉంటున్నావోనని ఈ అమ్మ అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. ఆటలాడుకొని అలసిపోయి వస్తే నా పొత్తిళ్లలో వెచ్చగా బజ్జుకోబెట్టేదాన్ని. మరిప్పుడు నిన్ను లాలించి జోల ఎవరు పాడుతున్నారు చిన్నా! నీ కోసం వెతికివెతికి జాడ కానరాక వెక్కివెక్కి ఏడిచి మా కన్నీరు ఇంకిపోయింది. నిన్ను మా చెంతకు చేరుస్తారనే నమ్మకంతో పోలీసు సారుల చుట్టూ ఎంత తిరిగినా నీ ఆచూకీ తెలియడం లేదు. మానవత్వం, మనసులేని ఏ బూచోడో మా నుంచి నిన్ను దూరం చేశాడు. తల్లిదండ్రుల ప్రేమకు నిన్ను దూరం చేసిన ఆ పాపాత్ముల మనసు మారి నిన్ను మా దగ్గరికి చేరిస్తే ఈ జీవితానికి ఇంతకన్నా ఏం అక్కర్లేదు. అమ్మా నాన్నా అంటూ నువ్వు పిలిచిన జ్ఞాపకాలే ఊపిరిగా నీ రాక కోసం బతుకుతున్నాం. నువ్వు తిరిగి రావాలి. ఈ అమ్మానాన్నలకు మళ్లీ ఆనందాలు పంచాలి. అప్పటి వరకు నీకోసం వెతుకుతూనే ఉంటాం."
-మాతృమూర్తి ఆవేదనకు అక్షర రూపం
12 రోజులు గడిచాయి..
వరంగల్ మట్టెవాడ పోలీసు ఠాణా పరిధిలో అపహరణ(Boy Kidnap in Mattevada)కు గురైన రెండేళ్ల బాబు డానియల్ ఆచూకీ 12 రోజులైనా తెలియరాలేదు. రాజమండ్రికి చెందిన ఆర్య, ఐశ్వర్య దంపతులకు ఒక్కగానొక్క కొడుకు డానియల్. ఐశ్వర్య తల్లి విజయ వరంగల్ ఎస్వీఎన్ రోడ్డులో నివాసం ఉంటారు. కిడ్నాప్ ఘటనకు నాలుగు రోజుల ముందు ఐశ్వర్య బాబుతో తల్లి వద్దకు వచ్చింది. వీరు తాత్కాలిక డేరాలో నివాసం ఉంటున్నారు. ఈనెల 10న రాత్రి నిద్రించాక తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డేరాను కత్తిరించి తల్లి పక్కన పడుకొని ఉన్న చిన్నారిని అపహరించారు(Boy Kidnap in Mattevada). ఐశ్వర్య నిద్రలేచాక పక్కన బాబు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. బాబు కనిపించకపోవడంతో మట్టెవాడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన తండ్రి ఆర్య రాజమండ్రి నుంచి వరంగల్‌కు రెండ్రోజుల తర్వాత వచ్చాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బాబును ఓ వ్యక్తి కిడ్నాప్(Boy Kidnap in Mattevada) చేసినట్టు అనుమానించి ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికి 12 రోజులైనా ఇంకా చిన్నారి ఆచూకీ తెలియకపోవడం గమనార్హం. కిడ్నాప్ వ్యవహారంలో ప్రత్యేక పోలీసు బృందాలు నాలుగు ఏర్పాటుచేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీసీపీ పుష్ప తెలిపారు.
దేవుడే దిక్కని
తల్లిదండ్రులు ఆర్య, ఐశ్వర్య బాబు కోసం గుండెలవిసేలా ఏడుస్తూ అనేక ప్రాంతాల్లో జాడ కోసం వెతికారు. తమ బంధువులు నివసించే ప్రాంతాలైన విజయవాడతోపాటు, మహబూబాబాద్, ఖమ్మం, నర్సంపేటల్లో ముమ్మరంగా గాలించారు. కడుపునిండా తిండిలేక, కంటిమీద కునుకులేక అమ్మానాన్నలు అనారోగ్యానికి గురవుతూ కంటి పాప కోసం కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వెతికి వెతికి ఇక దేవుడే దిక్కని భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు తిరుపతి, కేరళకు వెళ్లి తమ కొడుకు కనపడాలని కోటి మొక్కులు మొక్కుతున్నారు.