Road accident: ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. చావులోనూ వారి స్నేహబంధం విడదీయలేకపోయింది. కామారెడ్డి జిల్లా రామేశ్వర్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
కామారెడ్డిలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన రాహుల్(20), షఫీ(17) ఇద్దరు స్నేహితులు. రాహుల్ మున్సిపల్ కార్మికునిగా పని చేస్తుండగా షఫీ బోర్ వెల్ షాపులో పని చేస్తున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి బైకుపై రామేశ్వర్ పల్లి గ్రామానికి బయలుదేరారు. రామేశ్వర్ పల్లి నుంచి తిరిగి వస్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకునేందుకు యత్నించారు. అదే సమయంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బైకును ఢీకొట్టి సుమారు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.