ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. శివ బాలక్, రాహుల్ కశ్యప్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
యూపీకి చెందిన శివబాలక్, రాహుల్ కశ్యప్ లక్నో సమీపంలోని గోమతి నదిలో తాబేళ్లను పట్టుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పెంపుడు జంతువుల దుకాణాలు, అక్వేరియం షాపుల నిర్వాహకులకు వీటిని విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ విజిలెన్స్ అధికారి రాజా రమణారెడ్డి నేతృత్వంలోని బృందం.. కొనుగోలుదారులుగా వెళ్లి హైదరాబాద్ రామాంతపూర్‌లో నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 330 ఇండియన్ టెంట్ తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ రేంజ్ అటవీ అధికారికి అప్పగించారు.