తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉన్న దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామ శివారులో ఫిబ్రవరి 18న ఇద్దరు వ్యక్తులు పేలుడు పదార్థాలు తరలిస్తూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద 400 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 500 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 400 జిలెటిన్ స్టిక్స్, 549 మీటర్ల ఫ్యూజ్‌వైర్ లభించాయి. నిందితులను వనపర్తి జిల్లా అడ్డాకులకు చెందిన ముత్తు నాగరాజు, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లికి చెందిన కొమ్మరాజు కనకయ్యగా గుర్తించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లికి చెందిన సూర సారయ్య నుంచి వీటిని సేకరించినట్లు, కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరానికి చెందిన గుంజి విక్రమ్ వీటి సరఫరా బాధ్యతను నిందితులకు అప్పగించినట్లు దర్యాప్తులో తేల్చారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్-1 కమాండర్ మాడావి హిడ్మా ఆదేశాల మేరకే మందుగుండు సామగ్రిని దండకారణ్యానికి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నలుగురితోపాటు హిడ్మా, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ భార్య జజ్జెర్ల సమ్మక్క, మరో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య మడకం కోషిపై తాజాగల ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.