మహారాష్ట్ర ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మాజివడా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.
ఏం జరిగింది?
కొద్ది రోజులుగా.. అక్రమంగా దుకాణాలు ఏర్పరచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా.. వారి మధ్య ఘర్షణ తలెత్తింది.
ఈ క్రమంలో ఏసీపీ కల్పితా పింపుల్‌పై కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఏసీపీని హుటాహుటిన ఘోడ్బందర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఏసీపీ పక్కన ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి అనంతరం వీధి వ్యాపారులు పెద్దఎత్తున రహదారిపైకి చేరుకున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ఏసీపీపై దాడి కేసులో నిందితుడు అమర్జీత్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ వినయ్ రాఠోడ్ తెలిపారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి:Young Woman Suicide: ఆ పని తప్పని చెప్పినందుకు ఉరేసుకుని చనిపోయింది!