Hyderabad Drugs Case: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీ ఏజెంట్లుగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని పశ్చిమ అందేరికి చెందిన మహ్మద్ ఆసిఫ్ ఆరిఫ్ ఖాన్, అఫ్‌తాఫ్ అహ్మద్ ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్ ఆరిఫ్ ఖాన్‌లను పంజాగుట్ట పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. వీరు ముగ్గురు టోనీకి ఏజెంట్లుగా పనిచేసి మాదకద్రవ్యాల తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఎవరెవరికి విక్రయించారనే కోణంలో..
ముంబయిలో ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వీరు టోనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. టోనీ దాదాపు 15 బ్యాంకు ఖాతాల్లో మాదక ద్రవ్యాల డబ్బులను జమ చేశాడు. అందులో ఆరిఫ్ అనే ఏజెంట్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలోనే కోటి రూపాయలు కేవలం ఆరు నెలల వ్యవధిలో జమ అయినట్లు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు.