Drug smugglers: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నివారణకు రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసిన పోలీసులు... పటిష్ఠ నిఘా పెట్టారు. డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయని గుర్తించి.... మూడు ముఠాల ఆటకట్టించారు. హెచ్‌సీయూలో పీజీ చదువుతున్న విఘ్నేష్... డార్క్‌నెట్ ద్వారా మాదకద్రవ్యాలు కొని... తాను వినియోగించడమే కాకుండా ఇతరులకూ సరఫరా చేస్తున్నాడని నిర్ధరించారు. ఎల్ఎస్డీ ట్యాబ్లెట్లను ఆర్డర్ చేసి ఇతరులకు విక్రయిస్తున్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వినియోగదారుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు తేల్చారు.
ఆరుగురు ఐటీ ఉద్యోగులు..
యాప్రాల్‌కు చెందిన షేర్ మార్కెట్ వ్యాపారి జ్వాలా పాండే.... రెండేళ్లుగా మాదకద్రవ్యాలు సేవిస్తూ... విక్రయిస్తున్నాడని గుర్తించారు. నైజీరియాకు చెందిన నికోలస్‌తో కలిసి.. హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసి... ఐటీ ఉద్యోగులు, యువకులకు ఎండీఎంఏ బ్యాబ్లెట్లు సరఫరా చేస్తున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు. ఆదిలాబాద్ ఏజెన్సీ నుంచి గంజాయి ద్రావణాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడని తెలిపారు. నైజీరియన్‌తో పాటు ఆదిలాబాద్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. జ్వాలా పాండే ఇచ్చే పార్టీలకు హాజరయ్యే వారి జాబితాను పోలీసులు సేకరించారు. ఓ వైద్యుడితోపాటు మాదాపూర్, నిజాంపేట, మియాపూర్, శేర్‌లింగంపల్లికి చెందిన ఆరుగురు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.