Warangal Murders: అన్న కుటుంబంపై కత్తులతో తమ్ముడి దాడి.. ముగ్గురి మృతి - telangana crime news
06:05 September 01
ఎల్బీనగర్‌లో ముగ్గురి దారుణ హత్య
వరంగల్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని హతమార్చాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. వరంగల్‌లోని ఎల్బీ నగర్‌లో మహమ్మద్ చాంద్‌పాషా తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయనకు తన తమ్ముడు షఫీతో ఏడాదిగా పశువుల వ్యాపారం లావాదేవీల్లో వివాదం నడుస్తోంది. సుమారు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం చాంద్‌బాషా ఇంటిలోనే ఆయన కుటుంబంపై దాడి చేశాడని వరంగల్ ఏసీపీ కల్కోట గిరికుమార్ తెలిపారు.
తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో షఫీతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాంద్‌పాషా ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న చాంద్‌బాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు, బావమరిది ఖలీంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో చాంద్‌బాషా, సబీరా బేగం, ఖలీం అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారులు ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షఫీయే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చాంద్‌పాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. సుమారు 7 మంది ఆటోలో వచ్చారని... ఇంటి గేటును కట్టర్లతో కట్ చేసి లోపలికి ప్రవేశించారని వెల్లడించినట్లు ఏసీపీ గిరికుమార్ పేర్కొన్నారు. చాంద్‌పాషా ఇంటి పరిసరాలను క్లూస్‌టీం పరిశీలించింది.
ఇదీ చూడండి:tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!