HM died due to transfers : పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాడు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది.
ఎలా జరిగింది?
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాణోత్ జేత్రాo(57 ) నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఉద్యోగుల జిల్లా కేటాయింపుల్లో ఆయనను ములుగు జిల్లాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అంత దూరం ఎలా వెళ్లాలనే ఆలోచనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించారు.
ఎవరూ లేని సమయంలో..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని... ఆయన అప్పటికే మృతి చెందారని కుమారుడు గోపాల్ తెలిపారు. ట్రాన్సఫర్ వల్లే తమ తండ్రి మృతి చెందారని కుమారుడు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మా అమ్మ అంగన్వాడీ టీచర్. భార్యాభర్తలు ఒకే జిల్లాలో డ్యూటీ చేయాలని చెప్పినా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సొంత జిల్లా మహబూబాబాద్ జిల్లా కాకుండే వేరే జిల్లాకు ఎలా బదిలీ చేస్తారు. బదిలీ చేయడం వల్లనే మా డాడీకి ఇలా జరిగింది. మా నాన్న పెరాలసిస్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ట్రాన్స్ఫర్ చేసి మా కుటుంబ పెద్ద దిక్కును లేకుండా చేశారు. ఇప్పుడు మాకు దిక్కెవరు?