హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని నాగోల్ సమతాపురికాలనీలో విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన పదేళ్ల బాలుడు మృతి చెందాడు. లింగంపల్లిలో నివాసముంటున్న విశ్వనాథ్, రేణుకల పెద్ద కుమారుడు మనోజ్.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఇవాళ స్థానికంగా ఉన్న బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.
స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. పదేళ్ల బాలుడి దుర్మరణం..
వేసవి వచ్చేసింది. చిన్నాపెద్దా వేసవి తాపం తీర్చుకునేందుకు భాగ్యనగరంలో ఉత్సాహవంతులు స్విమ్మింగ్ పూల్స్ వద్దకు వెళ్తున్నారు. ఈత కొట్టేందుకు డబ్బులు వసూలు చేసే నిర్వాహకులు.. చిన్నారుల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. తరచుగా మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇలాంటి నిర్లక్ష్యానికే హైదరాబాద్లో మరో చిన్నారి బలయ్యాడు.
ఈతకొలను నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా మనోజ్ మృతి చెందాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈత కొలనులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాలుని మృతికి కారణమైన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు నిబంధనలు పాటించని ఈత కొలనులను మూసివేయించాలని పలువురు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: