Farmer Suicide : నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(22) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా తనకు ఉద్యోగం రాలేదు. ఇంతలోనే తండ్రికి అనారోగ్యం. జబ్బు పడిన తండ్రి వ్యవసాయం చేయలేకపోయాడు. ఇక ఉద్యోగ వేట మాని తండ్రికి సాయంగా ఉండాలని సాగు బాటపట్టాడు లక్ష్మణ్. తమకు ఉన్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
Farmer Suicide in Nalgonda : ఓవైపు దిగుబడి సరిగ్గా లేక.. మరోవైపు అకాల వర్షాలతో పండిన ఆ కాస్త పంట కూడా నష్టపోయి లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు. ఓవైపు సాగు చేసిన అప్పులు.. మరోవైపు తండ్రి ఆరోగ్యం చేసిన ఖర్చు అంతా కలిసి దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో అర్థంగాక.. సాగు చేసే ధైర్యం లేక.. ఉద్యోగం కూడా రాలేదన్న బాధతో లక్ష్మణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు.
young man suicide : గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకురాగా.. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.