Corona Cases in gurukul school : జగిత్యాల జిల్లా మల్యాల తాటిపెల్లి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏడుగురు విద్యార్థులకు కరోనా గురువారం నిర్ధరణ కావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గురుకుల పాఠశాలలో మొత్తం 586 మంది విద్యార్థులున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన 200 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వాళ్లలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలగా చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నావారిని పాఠశాల సిబ్బంది ఇంటికి పంపించారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరా..
గురుకుల పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడటంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థులతో మాట్లాడారు. ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకరికి కరోనా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు.
ముత్తంగి పాఠశాలలోనూ కరోనా..
Corona cases in muthangi gurukul : పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ఒక విద్యార్థికి స్వల్ప లక్షణాలు ఉండటంతో అనుమానంతో పాఠశాలలో వైద్య పరీక్షలు చేపట్టారు. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 27మంది సిబ్బంది, 491మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం 27 మంది సిబ్బంది, 261మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయురాలికి, 42మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తేలింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి ఆధ్వర్యంలో మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఇవాళ పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలోని మొత్తం 48 మంది బాధితుల్లో ఒక టీచర్, 47 మంది విద్యార్థులు ఉన్నారు.
వైరా గురుకులంలో కరోనా
corona cases in wyra gurukul school : ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.
గురుకులాలపై పంజా
Gurukul schools corona: పాఠశాలలు, వసతి గృహాలు తెరిచి... స్కూళ్లు, కాలేజీల కార్యకలాపాలు సవ్యంగా సాగుతున్న తరుణంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. ఇటీవల కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే దేశంలోకి ఈ వేరియంట్ చొరబడింది. ఒమిక్రాన్ పట్ల రాష్ట్రం అప్రమత్తమవుతున్న వేళ పాఠశాలల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది. ఇప్పటికే పలు గురుకులాల్లో వైరస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:Omicron worldwide: ఒమిక్రాన్.. ఏ దేశంలోకి ఎప్పుడు?