Farmer Death in Atmakur : చేతికొచ్చిన వేరుశనగ పంటపై వానర మూకలు దాడి చేస్తుంటే కాపాడటానికి ఆ రైతు శతవిధాలా ప్రయత్నించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు గుండె ఆగి పంట చేనులోనే కుప్పకూలిపోయారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఎలా జరిగింది?
కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్)కు చెందిన పందిరి రవీందర్‌రెడ్డి (55) ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేశారు. శనివారం రాత్రి వర్షం కురవడంతో ఆదివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లారు. అప్పటికే చేనులో వర్షపు నీరు నిలిచి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన కోతుల గుంపు వేరుశనగ మొక్కలను పీకేస్తుండటాన్ని గమనించారు. దీంతో తోటి రైతుల సహకారంతో వాటిని తరిమికొట్టేందుకు పరుగులు తీశారు. సగానికిపైగా పంటను కోతులు చెడగొట్టాయని, దిగుబడి రాక నష్టపోతానంటూ ఆవేదన చెందుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.