తెలంగాణ

telangana

Suicide note: కలకలం రేపుతున్న మరణ వాంగ్మూలం.. అందులో అసలేముంది?

By

Published : Jul 31, 2021, 7:56 PM IST

వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి రాసిన సూసైడ్​ నోట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిన్న ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్​ లేఖ బయటపడింది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ అతను రాసిన మరణ వాంగ్మూలం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

Suicide note
పాల్వంచలో ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్లు గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించడం, చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు తొలుత అందరూ భావించారు. కానీ శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చిన సూసైడ్​ నోట్​లో ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిలో కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటున్నాడు. సమీప బంధువులతో జరిగిన చిట్టీ వ్యాపారంలో రూ. 50 లక్షలు మోసపోయినట్లు మరణ వాంగ్మూలంలో వెంకటేశ్వర్లు తెలిపారు. బొల్లోరిగూడెం రామాలయం పక్కన ఉన్న ఇల్లు ఆక్రమణకు గురికావడం, ఆక్రమణదారులకు కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రౌడీషీటర్ల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితుని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించడం వంటివి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు. ఎవరి వద్దకు వెళ్లినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక.. విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నారు. 45 మంది వ్యక్తులు తన మరణానికి కారణమంటూ వివరించారు.

మీడియా ఎదుట మృతుని భార్య ఆవేదన

ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన నాయకులు, పోలీసుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెంకటేశ్వర్లు పేరుతో వెలువడిన సూసైడ్ నోట్ పలువురి గుండెల్లో గుబులు రేపుతోంది. వెంకటేశ్వర్లు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో మరణించాడు. ప్రముఖ నాయకుడితో సహా పోలీసు అధికారులు, వ్యాపారులు, రౌడీషీటర్లు తన చావుకు కారణమని రాసిన సూసైడ్ నోట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇద్దరు వ్యక్తుల వద్ద మేము రూ. 50 లక్షల చిట్టీ వేశాము. వాళ్లు డబ్బులు ఇవ్వకుండా దానికి బదులు స్థలం రాసిచ్చారు. వనమా రాఘవేంద్రరావు అనే వ్యక్తి అక్రమంగా మా నుంచి స్థలం లాక్కున్నారు. నా భర్తను జైలుకు పంపించారు. ఆ ప్లాటును హైదరాబాద్​కు చెందిన వ్యక్తికి అమ్ముకున్నారు. నిన్న ఈ విషయం అడిగేందుకు వెళ్తే తనపై దాడి చేసి అవమానించారు. అవమానభారం తట్టుకోలేక నా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ విషయాన్ని సూసైడ్​ నోట్​లో వెల్లడించారు. - శ్రావణి, మృతుని భార్య

సూసైడ్ నోట్​లో పేర్కొన్న అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే వెంకట్​రావు డిమాండ్ చేశారు. తన భర్త మరణానికి కారకులైన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మృతుని భార్య శ్రావణి విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి:ఉప ఎన్నికలు ఒక భాగం మాత్రమే: బీఎల్.సంతోష్

ABOUT THE AUTHOR

...view details