Student Suicide drama: వసతి గృహంలో ఉండటానికి ఇష్టపడని ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆడిన హత్యాయత్న నాటకం అటు వార్డెన్.. ఇటు పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి తనకు తానే షార్ప్‌నర్ బ్లేడుతో స్వల్పంగా గీసుకున్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. వసతిగృహ వార్డెన్ బెజవాడ అలివేలు మంగమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ, బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. సెలవుల తర్వాత ఇళ్ల నుంచి మంగళవారం వసతి గృహానికి తిరిగి వచ్చారు.
బుధవారం సాయంత్రం వారిలో ఒక బాలిక మెడ కింద, చెంపపై స్వల్ప గాట్లు ఉండటాన్ని తోటి విద్యార్థినులు గమనించి వార్డెన్‌కు తెలిపారు. ఆమె విద్యార్థినిని విచారించగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి తనపై హత్యాయత్నం చేసినట్లు చెప్పింది. కంగారుపడిన వార్డెన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వసతి గృహానికి చేరుకున్న ఎస్సై రాంబాబు విద్యార్థినిని ఆరా తీయగా.. భయంతో తానే ఇలా చేసుకున్నట్లు నిజం ఒప్పుకుంది. ఇంటికి వెళ్లిపోవడానికి ముగ్గురం కలిసి నిర్ణయించుకున్నామని, తాను పెన్సిళ్లు చెక్కే షార్ప్‌నర్ బ్లేడుతో మెడ, చెంపపై గాట్లు పెట్టుకున్నట్లు చెప్పడంతో ఉపాధ్యాయులు, వార్డెన్, పోలీసులు అవాక్కయ్యారు.
అనంతరం వారు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించి, ముగ్గురు విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నాటకం ఆడిన బాలికను తల్లిదండ్రులతో ఇంటికి పంపనున్నట్లు వార్డెన్ తెలిపారు. ఇదిలా ఉండగా.. తొలుత తాము ఉల్లిపాయలు పెట్టుకుని జ్వరం వచ్చినట్లు నాటకం ఆడదామనుకున్నామని, తోటి విద్యార్థినుల ప్రోద్బలంతో ఇలా కోసుకున్నట్లు బాలిక అమాయకంగా చెప్పడం గమనార్హం.