Khammam bike lift incident: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి విషం ఇంజక్షన్ గుచ్చి చంపిన ఘటన ఖమ్మంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటన సంచలనం కావడంతో ఖమ్మం సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. హత్య కేసు ఛేదనకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మున్నేటికి చెందినవారు కుట్ర పన్నారని నిర్ధరణ అయింది. జమాల్ సాహెబ్‌ను చంపేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు వెల్లడైంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఆర్ఎంపీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావించారు. ఆ కోణంలోనే పూర్తిగా కేసు విచారణను చేపట్టారు. అనుకున్నట్లుగానే అదే కారణమని తేలింది. జమాల్ భార్య ఫోన్ కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల నంబర్లు ఉండటం , వారితోనే ఎక్కువసార్లు మాట్లాడటం.. ఇవన్నీ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు బుధవారం పోలీసులు ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించనున్నారు.