ఈ ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకట్రెండు కిస్తీలు తామే కట్టేస్తారు. కుటుంబ సభ్యుల (నామినీ)తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వీళ్ల ముఠాలోని కొందరు అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని హత్య చేసి.. రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఏ కారుతోనో ఢీకొట్టించి.. ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్ తీసుకుంటారు. దాని సాయంతో బీమా పాలసీని క్లెయిమ్ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్ పార్టీ సభ్యులను, డబ్బుల పంపిణీలో బ్యాంక్ సిబ్బందిని కూడా ‘మేనేజ్’ చేస్తారు. వచ్చిన మొత్తంలో 20 శాతం నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని తలా కొంత పంచుకుంటారు.
బీమా డబ్బుల కోసం గత మూడేళ్లలో ఏకంగా ఐదారుగురిని దారుణంగా హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరించిందో ముఠా. ఈ దందాలో దామరచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా హత్యలకు సహకరిస్తున్న మొత్తం 17 మంది నిందితులను నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఏజెంటు ఒకరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీరిని రిమాండ్ చేయనున్నట్లు ఓ అధికారి 'ఈనాడు-ఈటీవీ భారత్'కు వెల్లడించారు.
వెలుగులోకి ఇలా
నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా నార్కట్‌పల్లి - అద్దంకి రహదారి పక్కన మరణించారు. ఆయన ట్రాక్టర్ ఢీకొని చనిపోయాడని భార్య కుటుంబ సభ్యులను నమ్మించింది.
అంత్యక్రియల సమయంలో మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను చూసి కోటిరెడ్డి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోటిరెడ్డి భార్యను గట్టిగా విచారించగా.. పక్క గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం తామే కోటిరెడ్డిని హత్య చేసి ట్రాక్టర్‌తో తొక్కించామని వెల్లడించినట్లు తెలిసింది. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంటును అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుగొలిపే విషయాలు బయటపడినట్లు సమాచారం. మూడు సంవత్సరాలుగా ఇదే తరహాలో సదరు ఏజెంటు ఓ ముఠాను ఏర్పాటు చేసి ఐదారుగురి ప్రాణాలు తీసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులను పంచుకున్నట్లు అంగీకరించాడు.