నల్గొండ జిల్లా హాలియాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడితో సహా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సాగర్ ఎడమ కాల్వలో దూకగా.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మహిళను కాపాడారు. ఈ ఘటనలో ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతి చెందాడు.
ఏం జరిగిందంటే..
నిడమానూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన హేమలత తన నాలుగేళ్ల పెద్ద కుమారుడు విశాల్‌తో కలిసి ఆమె పుట్టినిల్లయిన అనుముల మండలం కొత్తపల్లికి దసరా పండుగకు వచ్చింది. గాజులు కొనుక్కుంటానని చెప్పి హాలియా వచ్చింది. అక్కడే ఉన్న సాగర్ ఎడమ కాల్వలో కుమారుడితో సహా దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని వెంటనే గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అతి కష్టం మీద మహిళను ప్రాణాలతో కాపాడారు.
వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన కుమారుడు
అయితే వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో విశాల్ నీటిలో కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి కొంత దూరంలో బాలుడిని గుర్తించి స్థానికులు బయటకు తీసి హుటాహుటినా హాలియాలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని బంధువులు అంటున్నారు. బాలుడి మృతితో స్థానికుల్లో విషాదం నింపింది. ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లగా మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించారు.
ఇదీ చూడండి:Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం