Fire accident: కుటుంబ కలహాల కారణంగా గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించి.. తాను బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగింది. దేవేంద్రనగర్కు చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శ్రవర్కు గీతతో పెళ్లి కాగా.. వారికి ఇద్దరు కుమారులున్నారు. అయితే శ్రవణ్ కుమార్కు అతడి తల్లికి మధ్య తరచూ.. ఆస్తి గొడవలు జరుగుతుండేవి. గొడవల కారణంగా.. కొద్ది నెలల క్రితం శ్రవణ్.. ఇంటిని వదిలి మరో ప్రాంతంలో కిరాయికి ఉంటున్నారు. ఉద్యోగం కూడా మానేశాడు.
ఈరోజు తల్లి వద్దకు వచ్చిన శ్రవణ్.. తల్లిని కొంత నగదు ఇవ్వమని అడిగినట్లు సమాచారం. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన శ్రవణ్.. తల్లిని బయటకు పంపి ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి ప్రధాన ద్వారం కూడా తాళం వేసుకున్నాడు. ఇంట్లో ఉన్న మూడు సిలిండర్ల గ్యాస్ లీక్ చేసి.. నిప్పంటించాడు. ఒక్కసారిగా పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కల స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది.. జేసీబీ సాయంతో మొదటి అంతస్తులో ఉండే కిటికీలు ధ్వంసం చేసి మంటలను అదుపు చేశారు.