దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ ఉదంతంపై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ ఘటనపై దర్యాప్తు జరిపిన సిట్ అధికారి సురేందర్ రెడ్డిని కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ అనంతరం క్లూస్ బృందం తీసిన వీడియోగ్రఫీ అసమగ్రంగా ఎందుకుందని కమిషన్ తరపు న్యాయవాదులు ప్రశ్నించగా... ఆ విషయం తనకు తెలియదని సురేందర్ రెడ్డి బదులిచ్చారు. ఎన్కౌంటర్ జరిగిన డిసెంబరు 6న తీసిన ఫొటోల్లో తర్వాత ఎందుకు మార్పులు చోటు చేసుకున్నాయని అడిగితే చెప్పలేనని ఆయన బదులిచ్చారు. ఘటనాస్థలిలో దిశకు సంబంధించిన వస్తువులు సీజ్ చేసినట్లు ఫొటోలు ఉన్నాయా అని అడిగితే లేవన్నారు. ఎన్కౌంటర్ చోటు చేసుకున్నప్పుడు రాజశేఖర్, రవూఫ్‌లు ఎక్కడున్నారని అడిగితే గుర్తు లేదని చెప్పారు.
Sirpurkar Commission : 'తెలియదు.. చెప్పలేను.. గుర్తులేదు'.. సిర్పూర్కర్ విచారణలో సిట్ అధికారి - sirpurkar commission inquiry news
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించిన కమిషన్.. సోమవారం రోజున సిట్ అధికారి సురేందర్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని విచారించింది. విచారణలో వాళ్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ విస్తుబోయింది.
ఘటనాస్థలిలో ఖాళీ క్యాట్ రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారా.. అని ప్రశ్నించగా రెండు మాత్రమే లభించాయని ఆయన బదులిచ్చారు. అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని కమిషన్ విచారించింది. నిందితుల చిత్రాలను మీడియాకు ఎందుకు ఇచ్చారని అడిగారు. మీడియా ప్రతినిధులే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తీసుకున్నారని బదులివ్వడంతో కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుల అరెస్ట్ గురించి, రవి గెస్ట్ హౌస్ నిందితుల విచారణ గురించి కమిషనర్ సజ్జనార్‌కు సమాచారం ఇచ్చారా? అని అడిగితే ఇచ్చామన్నారు.
ఇదిలా ఉంటే త్రిసభ్య కమిషన్ విచారణకు సంబంధించిన అంశాలపై మీడియాలో ప్రచురితమవుతున్న కథనాలపై స్టేట్ కౌన్సిల్ సురేందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా ప్రతిష్టను దెబ్బతీసే కథనాలేవో ప్రత్యేకించి చెబితే తప్ప చర్యలు తీసుకోలేమని కమిషన్ స్పష్టం చేసింది. వారికి అలాంటి అభ్యంతరాలుంటే వారే చర్యలు తీసుకోవచ్చని సూచించింది.