Inter students suicide :ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని ఏడుగురు.. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిదిమంది చనిపోగా ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు, పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపల్లికి చెందిన విద్యార్థిని ఒకరు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించలేకపోయామని ముగ్గురు, తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు నగరంలో తనువు చాలించారు.
telangana inter results : ద్వితీయ సంవత్సరం చదివే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంటతండా, బడంగ్‌పేట అన్నపూర్ణనగర్ విద్యార్థులు ఫెయిలయ్యామని ఆత్మహత్య చేసుకున్నారు. సైఫాబాద్ ఠాణా చింతలబస్తీకి చెందిన బాలుడు అన్నీ పాసయినా తక్కువ మార్కులు వచ్చాయని ప్రాణం తీసుకున్నాడు. ఉత్తీర్ణత సాధించలేదని కాటేదాన్ పారిశ్రామికవాడకు చెందిన ఫస్టియర్ విద్యార్థి స్థానిక ప్రజాప్రతినిధి సంబంధీకులకు చెందిన ఓ భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బాలుడు తండ్రితో మాట్లాడగా తన కుమారుడు మూర్ఛతో భవనం పైనుంచి పడి మృతి చెందిన్నట్లు తెలిపారు.