తమిళనాడు కూలీలను రప్పించి శేషాచలం అడవుల నుంచి... ఎర్రచందనం అక్రమ రవాణా చేసే అక్రమార్కులు కరోనా కట్టడి కోసం ఏపీలో విధించిన కర్ఫ్యూ ప్రభావంతో రూటు మార్చారు. కర్ఫ్యూలో భాగంగా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో కొత్త దారిపట్టారు. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న చిత్తూరు జిల్లా తూర్పు మండలాలపై పడ్డారు. అక్కడ దొరికేది ద్వితీయ శ్రేణి ఎర్రచందనమైనా సరే ఉపాధి కోసం దొరికిన చెట్లను తెగనరుకుతున్నారు. ప్రస్తుతం గతంలో లేని విధంగా శ్రీకాళహస్తి, ఏర్పేడు, కేవీబీపురం మండలాల్లో.. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల అలజడి ఎక్కువగా కనిపిస్తోంది.
కరోనా కర్ఫ్యూతో ఎర్రచందనం దొంగల ఉక్కిరిబిక్కిరి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు దారి మార్చారు. సాధారణంగా శేషాచలం అడవుల్ని లక్ష్యంగా చేసుకునే దుంగల దొంగలు... ముందెన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లా తూర్పు మండలాలపై కన్నేశారు. అప్రమత్తమైన ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు... పకడ్బందీగా కూంబింగ్ నిర్వహిస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు.
ఇటీవల తూర్పు మండలాల్లో ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతున్నట్లు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఆయా చోట్ల రిజర్వ్ ఫారెస్టులో పకడ్బందీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మే మొదటి వారంలో పది ఎర్రచందనం డంప్‌లు గుర్తించారు. 138 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తీర్థకోన గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో మరో 58 దుంగలు పట్టుకున్నారు.
లాక్‌డౌన్ కారణంగా..తమిళనాడు కూలీలను తీసుకురావటం కష్టం అవుతోందని భావించిన స్మగ్లర్లు రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను ఈ ఊబిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.