సైదాబాద్‌లో జరిగిన పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌తో పాటు మొత్తం పది బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
వైన్సుల ముందు...
నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్‌ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే సాంకేతికత ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు. ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్‌కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాంక్ బండ్ సహా ప్రతి పార్కును గాలిస్తున్న బృందాలు... రైల్వేస్టేషన్, బస్స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లలో జల్లెడపడుతున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
మద్యం దుకాణాల వద్ద..
రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు సైదాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకంట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు.
పారిపోవాలంటూ..