CP On Fake Certificates: నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. వారి వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్స్, ప్రింటర్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి రోహిత్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
నిందితులు కాకతీయ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలకు చెందిన ధృవపత్రాలను జారీ చేస్తున్నారని సీపీ తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక్కో సర్టిఫికెట్‌కు దాదాపు 30 నుంచి 40వేలు వసూలు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా వీటిని తీసుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు 20 మందికి నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్లు రాచకొండ సీపీ స్పష్టం చేశారు. శ్రీలక్ష్మీ కన్సల్టెన్సీ ద్వారా ఈ నకిలీ దందా కొనసాగిస్తున్నారని మహేశ్ భగవత్ తెలిపారు.