Karimnagar Car Accident: కరీంనగర్లో కూలీలపై కారు దూసుకెళ్లిన ఘటనలో బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు, పలు పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఆందోళనలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఘటనపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ప్రకటించారు. ఆ సాయాన్ని వారి కుటుంబాలకు ఆర్డీవో ఆనంద్ కుమార్ అందించారు.
ఎందుకు అరెస్ట్ చేయలేదు.?
కారు బీభత్సంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన వారిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. కూలీలు బలవుతున్నా వారికి పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం లేదని మండిపడ్డారు.
"మాకు పని దొరికితేనే పూట గడిచేది. మా పిల్లలు చనిపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న మాకు దిక్కులేకుండా పోయింది. ఇంత జరిగినా ప్రమాదానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అందుకే రోడ్డుపై బైఠాయించాం." -బాధితుల బంధువులు
"కారు సృష్టించిన బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు ఇంతవరకూ మంత్రి ఇక్కడికి రాలేదు. గుడిసెలు పీకేసినందుకు పునరావాసం కల్పించాలని కూలీలు వేడుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయలేదు." - ప్రతిపక్షాల నాయకులు