తెలంగాణ

telangana

ETV Bharat / crime

Saidabad rape case : సైదాబాద్‌ కేసు నిందితుడి కోసం గాలింపు.. వేషం మార్చినా గుర్తుపట్టేలా ఫొటోలు - సైదాబాద్‌ రేప్​ కేసు

చరవాణి వాడకపోవడం, ఎక్కడపడితే అక్కడ తిరగడం... కూలీ పనిచేస్తే వచ్చే డబ్బులతో పూటుగా కల్లు, మద్యం సేవించి పుట్ ఫాత్​లపై నిద్రించడం... ఇదీ సైదాబాద్ హత్యాచార నిందితుడి రాజు అలవాట్లు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడం, రోజుల తరబడి ఇంటికి రాకపోవడం రాజు నైజం. మేనత్త కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా రెండు చేతులపైనా మరదలు పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. రాజు వేదింపులు భరించలేక కట్టుకున్న భార్య కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న రాజు కుటుంబ నేపథ్యం ఇది.

Saidabad rape case
Saidabad rape case

By

Published : Sep 15, 2021, 9:02 PM IST

రూ.10 లక్షల రివార్డు, ఆటోలు, రైళ్లు, బస్సులు, జన సమర్థ ప్రాంతాల్లో పోస్టర్లు. 24 గంటల పాటు గాలిస్తున్న మూడు కమిషనరేట్ల పరిధిలోని వేయి మందికి పైగా పోలీసులు. ఇదేదో గజ దొంగ లేకపోతే ఉగ్రవాదిని పట్టుకోవడానికి పోలీసులు పడుతున్న పాట్లు కాదు. సైదాబాద్ హత్యాచార నిందితుడు (Saidabad rape case) రాజు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు పడుతున్న పాట్లు. ఈ నెల 9న చిన్నారిని పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ఆరు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అయినా అతని ఆచూకీ ఏమాత్రం లభించలేదు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి నేరుగా దిగి గాలింపును పర్యవేక్షిస్తున్నారు.

సీసీ కెమెరాల పరిశీలన

నిందితుడు ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో సంచరిస్తుండొచ్చనే ఉద్దేశంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్​ను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు 24గంటల పాటు గాలింపు చర్యల్లోనే ఉన్నారు. ప్రధాన రహదారులు, వీధులతో పాటు కాలనీల్లో ఉండే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఎస్సై ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటు చేసి స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కూడళ్ల వద్ద నిఘా

ట్రాఫిక్ పోలీసులు కూడా కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. మూడు కమిషనరేట్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో గాలింపు కొనసాగుతోంది. రైళ్లు, బస్సులు, ఆటోలపై పోస్టర్లు అంటించారు. జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలకు రాజు చేసిన నేరం గురించి వివరిస్తూ అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో సర్వత్రా విమర్శలు వస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. రాజకీయ, ప్రజా సంఘాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు.... ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దీంతో నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

హోం మంత్రి సమీక్ష

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన (Saidabad rape case) పట్ల సీఎం కేసీఆర్ విచారాన్ని వ్యక్తం చేసినట్లు హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ హత్యాచార ఘటనపై సమీక్షించారు. నిందితుడిని గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రికి డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలని డీజీపీని మహమూద్ అలీ ఆదేశించారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు.

గతంలోనూ ఓ కేసు

వరంగల్​లో చిన్నారి హత్యాచార ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించిందని... సైదాబాద్ హత్యాచార ఘటనలోనూ నిందితుడిని పట్టుకొని చట్టపరంగా కఠినంగా శిక్షపడేలా చూడాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ను మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పీఎస్ లో ఓ కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో చైతన్యపురి పోలీసులు గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. బెయిల్​పై రాజు బయటికి వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో, తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది.

నిర్మానుష ప్రాంతాల్లో గాలింపు

కేవలం 3వ తరగతి వరకే చదివిని రాజు ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎప్పుడో ఒకసారి మాత్రమే సొంతగ్రామమైన జనగామ జిల్లా కడకొంట్లకు వెళ్లొస్తుంటాడని ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు తెలిపారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని... వాళ్లతో కలిసి కూలీ పనిచేసే వచ్చే డబ్బులను పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిర్మానుష ప్రాంతాలు, మురికివాడల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు చేసిన నేరం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కాబట్టి... అతని ఆచూకీ లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వేషం మార్చినా గుర్తుపట్టేలా

నిందితుడిని పట్టుకోడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజును పట్టిస్తే పది లక్షల రివార్డును అందిస్తామని పోలీసులు మంగళవారం ప్రకటించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషంలో తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడు రాజు ఊహా చిత్రాలను విడుదల చేశారు.

సంబంధిత కథనాలు :చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది: పవన్​కల్యాణ్​

'సీఎం కేసీఆర్​ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'

సైదాబాద్ హత్యాచారం కేసులో రంగంలోకి డీజీపీ

ABOUT THE AUTHOR

...view details